ముక్కలుగా నరికి కారులో కుక్కి..

ముక్కలుగా నరికి కారులో కుక్కి..
  • యూఏఈలో కర్నాటక వ్యక్తి దారుణ హత్య
  • భార్య, కుమారుడు మిస్సింగ్‌  

ఉడుపి: కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి మృతదేహాన్ని 9 ముక్కలుగా నరికి, రెండు బ్యాగుల్లో కుక్కి కారులో పడేశారు. జులైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు మృతుడి భార్య, కుమారుడు కూడా మిస్సింగ్‌ అయ్యారు.

కర్నాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన ఆల్విన్ ప్రకాశ్ కుందర్ గత 14 ఏండ్లుగా షార్జా ఎయిర్‌‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య టీనా కుందర్ అక్కడ టీచర్‌‌గా పనిచేస్తుండగా, వీరి కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. ముగ్గురూ షార్జాలోనే నివాసం ఉంటున్నారు. జులై 20న ప్రకాశ్ సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ అతడికి ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయలేదు.

అయితే కాసేపటికే ‘నేను బాగానే ఉన్నాను’అని టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ప్రకాశ్ సాధారణంగా కుటుంబ సభ్యులతో వాయిస్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అలవాటు ఉండటంతో, టెక్స్ట్ మెసేజ్ రావడంపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన అనిల్, షార్జాలో ఉంటున్న ప్రకాశ్ స్నేహితుడు మనోహర్‌ను సంప్రదించి సమాచారం తెలుసుకోవాలని కోరాడు.

మనోహర్.. ప్రకాశ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా, అతడు భారత్‌కు వెళ్లాడని వాచ్‌మన్ చెప్పాడు. కంపెనీ హెచ్ఆర్ విభాగం కూడా ప్రకాశ్ ఇండియా వెళ్లాడనే సమాచారం ఇచ్చింది. అయితే, ప్రకాశ్ స్వదేశానికి చేరుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో పాటు పాస్‌పోర్ట్ వివరాలు పరిశీలించగా, అతడు షార్జా విడిచి వెళ్లలేదని తేలింది. దీంతో స్థానిక పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు అందింది.  

కారులో 9 ముక్కలుగా డెడ్‌బాడీ..

దర్యాప్తు ప్రారంభించిన షార్జా పోలీసులకు ఒమన్ వెళ్లే రహదారిలో పార్క్ చేసిన ఓ కారులో రెండు బ్యాగులు లభించాయి. వాటిని తెరిచి చూడగా తొమ్మిది ముక్కలుగా నరికిన ప్రకాశ్ మృతదేహం బయటపడింది. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై షార్జా పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు, ప్రకాశ్ హత్య తర్వాత అతడి భార్య టీనా, కుమారుడు కూడా అదృశ్యమయ్యారు.

వారు షార్జా విడిచి భారత్‌కు వెళ్లి ఉండవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ హత్యలో భార్య పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఆధారాలు లభ్యం కాలేదు. ఈ కేసుపై ఉడుపి ఎస్పీని కలిసిన ప్రకాశ్ సోదరుడు.. తమకు న్యాయం చేయాలని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని వినతిపత్రం సమర్పించారు.